💦 *బుద్ధ జాతక కథలు - 1*
*సర్వజ్ఞులు*
ఒకసారి ఒక సాధువు, బుద్ధుని దగ్గరకు వచ్చి ''భగవాన్! మీరు సర్వజ్ఞులట గదా!'' అని, వినయంగా నమస్కరించాడు.
''అని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదే! ప్రపంచంలో సర్వజ్ఞులెవరూ ఉండరు'' అని బుద్ధుడు ఈ కథ చెప్పాడు.
--వారణాసిని పాలిస్తున్న రాజుకు నలుగురు కుమారులు, వారికి జ్ఞానార్జన పట్ల ఆసక్తి ఉండేది. ఆ రాజ్యంలోని మహారణ్యం మధ్యలో అతి విశాలమైన మోదుగు చెట్టు ఒకటుంది. ఆ చెట్టు గురించి, దాని అందం గురించి, దాని వయస్సు గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అది విన్న రాకుమారులకు దాన్ని చూడాలనే ఉత్సుకత కలిగి తండ్రికి చెప్పారు.
''కుమారులారా! మన రథసారథి ఆ మార్గంలో పోయి వస్తూంటాడు. అత న్ని అడగండి. తీసుకుపోతాడ''న్నాడు. వారు రథసారథి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పారు.
''రాకుమారులారా! ఇప్పుడు కాదు. నేను త్వరలో వెళ్తాను. వెళ్లినప్పుడల్లా నా వెంట మీలో ఒక్కొక్కరినే తీసుకుపోతాను. అందర్నీ ఒకసారి తీసుకుపోవడం క్షేమం కాదు - ఇది రాజాజ్ఞ'' అని చెప్పాడు.
చెప్పినట్టుగానే కొద్ది రోజులకే మొదటివాణ్ణి తీసుకువెళ్లాడు. ఆ సమయానికి చెట్టు ఆకులన్నీ రాల్చి ఉంది. కొన్నాళ్ళకు రెండోవాణ్ణి తీసుకుపోయాడు. ఆ సమయానికి పచ్చటి చిగుళ్లు వేసి చెట్టు నవనవ లాడుతూ ఉంది. మరికొంతకాలానికి మూడోవాణ్ణి వెంటబెట్టుకు వెళ్లాడు. ఆ సమయానికి చెట్టంతా పూలతో నిండి ఉంది. మరికొంత కాలానికి నాలుగోవాణ్ణి తీసుకెళ్లాడు. ఆ సమయానికి ఆ చెట్టు పండ్లతో విరగకాసి ఉంది.
ఒకరోజున వారు నలుగురూ ఒకచోట కూర్చొని తాము చూసిన మోదుగు చెట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్దవాడు - '' సోదరులారా! మోదుగు చెట్టు ఎలా ఉంటుందనుకున్నారు. అది కాలినకట్టెలా నల్లని మోడులతో విస్తరించి ఉంటుంది'' అన్నాడు.
''కాదు సోదరా! అది పచ్చని ఆకులతో మర్రిచెట్టులా గుమ్మటంలా కొండంత ఉంటుంది'' అన్నాడు రెండోవాడు.
''లేదు సోదరా! అది ఎర్రని పూలు గుట్టగాపోసిన పెద్ద రాశిలా ఉంటుంది'' అన్నాడు మూడోవాడు.
''అన్నలారా! ఆగండి! అలా ఉండదు. పండ్లు గుట్టపోసినట్టు ఉంటుంది'' అన్నాడు చివరివాడు.
ఆ నలుగురూ ఎవరు చూసింది వారు చెప్పారు. 'నాదే సరైనది'' అని తగవులు పడ్డారు. తండ్రి దగ్గరకు వె ళ్లి విషయం చెప్పారు. ''కుమారులారా! మీ నలుగురి అభిప్రాయం తప్పు. మీకు తెలిసింది ఆ చెట్టు గురించి కొద్ది జ్ఞానం మాత్రమే. కాబట్టి ''మీకు తెలిసింది సరైనది'' అనే అహం వద్దు. మీరే కాదు... ఏ వ్యక్తీ అయినా జ్ఞానపూర్ణుడు, సర్వజ్ఞుడు కాలేడు. ఈ విషయం ఎరిగితే విజ్ఞత వస్తుంది, అహం నశిస్తుంది'' అని ఆ రాజు కుమారులకు చెప్పాడు.
బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న సాధువుకు సర్వజ్ఞులెవరూ లేరని అర్ధమయింది..
💦🐋🐥🐬💦
0 Comments:
Post a Comment